తుపాను వేగంతో పునర్నిర్మాణం !!!
ఉత్తరాంధ్ర జనజీవనాన్ని అతలాకుతలం చేసిన హుద్‌హుద్‌ తుపాను, తీర రక్షణకు తక్షణం పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. మడ అడవులు, పగడపు గుట్టలను సంరక్షించుకోవడంతోపాటు గట్టి హెచ్చరికల వ్యవస్థ, సమర్థ అత్యవసర సేవల ద్వారానే ప్రకృతి విపత్తుల దుష్ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉందనేది సుస్పష్టం. ప్రభుత్వం సరైన ప్రణాళికలు రచించి ఆ దిశలో ముందడుగు వేయడమే కీలకమిప్పుడు...
 
సముద్రతీరంలో తుపానులు కొత్తేమీ కాదు. అయితే ఈ దఫా తూర్పు కోస్తాతీరంపై విరుచుకుపడ్డ 'హుద్‌హుద్‌' మాత్రం ఉత్తరాంధ్ర ప్రజల్ని తీవ్రంగా వణికించింది. గడచిన వందేళ్లలో ఇంత విధ్వంసకర తుపాను చవిచూడలేదని వాతావరణ నిపుణులు సైతం చెబుతున్నారు. మునుపు సంభవించిన వాటితో పోల్చితే పట్టణ ప్రాంతాలను తాకి అత్యధికంగా నష్టం కలిగించిన తుపాను ఇదేనని చెబుతున్నారు. చండప్రచండంగా వీచిన గాలులకు ఉత్తరాంధ్ర పల్లెలతో పాటు, విశాఖ నగరమూ కకావికలమైంది. అంతులేనంతగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించింది. తుపాను అనంతరం ఎదురైన సవాళ్లను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సమర్థంగా ఎదుర్కొన్నాయి. ప్రకృతి వనరులు, మౌలిక వసతులు, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు కలిగిన నష్టాన్ని పూడ్చడానికి చాలా సమయం పడుతుంది. హుద్‌హుద్‌ తుపాను అనుభవాలతో తీరరక్షణకు పటిష్ఠమైన దీర్ఘకాలిక కార్యాచరణను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
విచ్చలవిడి విధానాలే శాపం
మనదేశంలోని తీర ప్రాంతంలోని వనరులు, ఉత్పాదక ఆవాసాలు, విశిష్టమైన జీవవైవిధ్యంతో ఆర్థిక పరిపుష్టికి వూతమిస్తున్నాయి. దేశం భూభాగం వెంబడి 7,500 కిలోమీటర్ల మేర సముద్రతీర ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో రెండువేల కిలోమీటర్ల మేర అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప దీవుల్లో తీరం ఉంది. సముద్రతీరానికి 50కిలోమీటర్ల లోపు 25కోట్ల మేర జనాభా ఉంది. తీరప్రాంతంలో విస్తారమైన మడ అడవులు, ఉప్పునీటి కయ్యలు, చిత్తడి నేలలు, పగడపు గుట్టలు, అనేక రకాల ఇసుక నేలలతో విశిష్ట ప్రకృతి జీవవైవిధ్య సంపద ఉంది. జనాభా పెరుగుదల, నగరీకరణ, అభివృద్ధి పేరిట తీరంలో విచ్చలవిడి నిర్మాణాలు, పరిశ్రమలు, పోర్టుల ఏర్పాటువల్ల ఈ జీవవైవిధ్యంపై అంతకంతకూ ఒత్తిడి పెరిగిపోతోంది. తీరప్రాంత ప్రకృతి వ్యవస్థలను ఛిద్రం చేయడానికి కారణమవుతోంది. ఇదే తీరప్రాంతం ఎన్నో విపత్తులకూ కేంద్రబిందువుగా ఉంది. కోస్తా తీరంలో దివిసీమ(1977), కోనసీమ(1997), ఒడిశా(1999) తుపానులతోపాటు తాజా హుద్‌హుద్‌, తీరాన్ని ఆనుకున్న ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపాయి. 2004నాటి సునామీ దేశ తీరప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం, వాతావరణంలో పెనుమార్పులవల్ల తలెత్తే విపత్తులను మానవాళి ఎదుర్కోవడం సాధ్యమయ్యే పని కాదు. ముందస్తు ఏర్పాట్లతో నష్టప్రభావాలను కొంతమేర తగ్గించుకోవచ్చు. తీరప్రాంత ప్రజల నివాసం రక్షితంగా ఉండే రీతిలో ప్రణాళికలు అమలు చేయడం, మడ అడవులు, పగడపు గుట్టలను సంరక్షించుకోవడంతోపాటు తీరానికి హరిత వనాలతో భద్రత ఏర్పాటు చేయడం, పటిష్ఠ హెచ్చరికల వ్యవస్థ, అత్యవసర సర్వీసులను అందుబాటులో పెట్టుకోవడం వంటి చర్యల ద్వారా తుపానుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించవచ్చు.
 
కొరగాని చట్టాలు
దేశంలో తీరప్రాంత పరిరక్షణ కోసం పర్యావరణ పరిరక్షణ చట్టం-1986కు అనుబంధంగా కేంద్రప్రభుత్వం 1991లో తీరప్రాంత నియంత్రణ నిబంధనల అమలు తీరుపై నోటిఫికేషన్‌(సీఆర్‌జెడ్‌)ను తీసుకొచ్చింది. దీనిద్వారా తీరప్రాంతాల్లో చేపట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను నియంత్రించి తీరప్రాంత పర్యావరణ వ్యవస్థలను భద్రంగా చూసుకోవాలి. అందుకు అవసరమైన ఏర్పాట్ల కోసం ఈ నిబంధనలను అమలులోకి తెచ్చారు. చేపల వేట కేంద్రాలు, పోర్టులు, వాణిజ్య నౌకారవాణా, వన్యప్రాణి సంరక్షణ, జల సంరక్షణ, భారత తీరప్రాంత రక్షణ, విదేశీ నౌకా నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, ప్రమాదకర వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన అనేక చట్టాలు తీరప్రాంత పరిరక్షణతో ముడివడి ఉన్నాయి. ఈ నిబంధనల్లో తీరాన్ని మూడు మండలాలుగా విభజించారు. అక్కడ వివిధ నిర్మాణాలు చేపట్టడానికి నియంత్రణలు విధించారు. 1991లో అమలులోకి వచ్చిన సీఆర్‌జెడ్‌ నిబంధనలు అమలుచేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యం కనబరచారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిబంధనలు అడ్డుగా ఉన్నాయని సవరణలు చేసి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు అనుకూలంగా మార్చడం తప్పితే పటిష్ఠం చేయాలన్న ఆసక్తి చూపలేదు. 1991-2003 మధ్యకాలంలో 12మార్లు నిబంధనలు సవరించి, అభివృద్ధి కార్యక్రమాల విస్తృతికి అనుమతించారు. ఈ నోటిఫికేషన్‌ అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదే అయినా, అమలుకు అవసరమైన నిధుల కేటాయింపుల గురించి ఎక్కడా కేంద్రం ప్రస్తావించకపోవడంతో ఈ అంశాన్ని రాష్ట్రాలు తేలిగ్గా తీసుకున్నాయి. 1991 సీఆర్‌జెడ్‌ నిబంధనలు అమలు తీరుపై నియమించిన ఎమ్‌.ఎస్‌.స్వామినాథన్‌తో సహా అనేక కమిటీల నివేదికల్లో అసలు సారాంశాన్ని గత యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. సీఆర్‌జెడ్‌ నిబంధనలకు చట్టబద్ధత తీసుకొచ్చి, కోస్తా నియంత్రణను పటిష్ఠపరచాలంటూ నిపుణులు చేసిన సిఫార్సులను బుట్టదాఖలు చేశారు. ఏళ్ల తరబడి చర్చల అనంతరం సీఆర్‌జెడ్‌ నిబంధనలను పూర్తిగా నిర్వీర్యం చేసి, మళ్ళీ కొత్త నోటిఫికేషన్‌ను 2011లో జారీ చేశారు. దీని ప్రకారం మొదట తీర రాష్ట్రాలన్నీ తగిన యాజమాన్య ప్రణాళికలను కేంద్రానికి సమర్పించాలి. నోటిఫికేషన్‌ ఇచ్చిన మూడేళ్ల తరవాత ఈ ఏడాది మే ఏడున కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ముసాయిదా ప్రణాళికలు సమర్పించాలని ఆదేశించింది. అందుకు సెప్టెంబరు 30 వరకు గడువు విధించింది కూడా. అయినా, కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో తీరప్రాంత యాజమాన్య అథారిటీలు ఏర్పాటైన దాఖలాలే లేవు. చాలా రాష్ట్రాల్లో వీటి నిర్వహణ బాధ్యతల్ని అటవీ శాఖకు అప్పగించారు. మొక్కుబడిగా ఏర్పాటైన జిల్లా, రాష్ట్ర స్థాయి అథారిటీలు అతీగతీ లేకుండా పోయాయి. ఫలితంగా యాజమాన్య ప్రణాళిక తయారయ్యేదెప్పుడో అర్థంకాని పరిస్థితి నెలకొంది!
 
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌ వంటి దేశాలు తీరప్రాంత పరిరక్షణకు ఏళ్ల తరబడి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నాయి. అమెరికాలో 60శాతం జనాభా తీరప్రాంతంలోనే నివసిస్తోంది. తీరప్రాంత నిర్వహణ, పరిరక్షణ కోసం అమెరికా ప్రభుత్వం 1972లోనే తీర ప్రాంత యాజమాన్య చట్టాన్ని(సీజెడ్‌ఎం) అమలులోకి తెచ్చింది. దేశ సమాఖ్య ప్రభుత్వం, తీర ప్రాంత రాష్ట్రప్రభుత్వాలు తీర రక్షణకు సంబంధించి ప్రణాళికలు, కార్యాచరణల్లో స్వచ్ఛంద సహకారాన్ని ఇచ్చి పుచ్చుకొంటాయి. సహజ వనరులు, తీర ప్రాంత అభివృద్ధి, ప్రజావసరాలు వంటి జాతీయ విధానాలను ఈ చట్టం ప్రతిబింబిస్తుంది. తీరప్రాంత రాష్ట్రాలు సైతం తమ పరిధిలో చట్టాల్ని అమలు చేస్తున్నాయి. మన తీరప్రాంత రాష్ట్రాలు ఇప్పటికీ యాజమాన్య ప్రణాళికల రూపకల్పనలోనే పొద్దుపుచ్చుతున్నాయి. కోస్తా తీరంలో పెట్టుబడులు రాబట్టేందుకు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికల్లోనూ తీర ప్రాంత పరిరక్షణ, యాజమాన్యానికి సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికలు పొందుపరచకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 1977లో దివిసీమ ఉప్పెన తరవాత రాష్ట్రంలో తీరం వెంబడి తుపానుల తాకిడి తగ్గించటానికి సరుగుడు, యూకలిప్టస్‌ వంటి ఎత్తయిన మొక్కల పెంపకాన్ని చేపట్టారు. తరవాత అటవీ శాఖ నిర్లక్ష్యంవల్ల ఆ వనాలు ఎక్కడా కనబడని దుస్థితి దాపురించింది. పోర్టులు, పరిశ్రమలు, పర్యాటక పథకాల పేరిట తుపానులను అడ్డుకునే మడ అడవులు, హరితవనాలపై కోతపడటంవల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. తీరప్రాంత రక్షణకు ప్రకృతి ప్రసాదించిన వ్యవస్థలను పరిరక్షించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. మరోవైపు ప్రకృతి విపత్తులను అధిగమించడానికి వ్యవస్థీకృత ఏర్పాట్లు చేయడంలోనూ నిర్లిప్తంగా వ్యవహరించాయి. హుద్‌ హుద్‌ తుపాను సమయంలో ముఖ్యమంత్రి స్థానికంగా బసచేసి నడిపిస్తేనే కాని దిక్కుతోచని రీతిలో యంత్రాంగం ఉండిపోవడానికి ఏళ్ల తరబడి కొనసాగిన నిర్లక్ష్యమే కారణం. వాస్తవానికి అన్ని రాష్ట్రాలు విపత్తుల యాజమాన్య ప్రణాళికలు రూపొం దించాయి. ఆయా సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం చేపట్టాల్సిన అత్యవసర చర్యల్ని ఈ ప్రణాళిక వివరిస్తుంది. మండల, డివిజన్‌, జిల్లా, రాష్ట్రస్థాయుల్లో సంబంధిత సంఘాలు మొక్కుబడిగా మారడమే విషాదం.
 
సమష్టి బాధ్యత
తుపానులు, భూకంపాలు వంటి విపత్తులు వచ్చిన వెంటనే రెండు మూడు రోజుల వ్యవధిలో నష్టం అంచనాలను సమీకరిస్తే తదనంతర రోజుల్లో ప్రాధాన్య క్రమంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై స్పష్టత ఏర్పడుతుంది. తుపాను హెచ్చరికలకు ప్రభావితమయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకైనా చేరవేయలేని దురవస్థ ఇప్పుడు ఉంది. కోస్తా తీరంలోని తొమ్మిది జిల్లాల్లో 1,136 తుపాను షెల్టర్లే ఉన్నాయి. ఇవన్నీ 1978-2000 మధ్య కాలంలో నిర్మించినవి. సముద్రం దగ్గర్లో నిర్మించే ఎలాంటి కట్టడాలైనా త్వరగా శిథిలమవుతాయి. ప్రస్తుత తుపాను షెల్టర్లలో 70శాతం పరిస్థితి అదే. హుద్‌ హుద్‌ తుపాను ఉత్తరాంధ్రలోని ప్రధాన నగరాలతోపాటు గ్రామీణ, గిరిజన ప్రాంతాలనూ గట్టిగా తాకింది. వందేళ్లకు పైగా వయసున్న భారీ వృక్షాలతో సహా దట్టమైన అటవీ ప్రాంతం విధ్వంసమైంది. పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు, పంటలకు భారీయెత్తున నష్టం కలిగింది. సహాయ పునరావాస చర్యల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చురుకుగా వ్యవహరించినా, ఉత్తరాంధ్రలో పునర్‌వైభవాన్ని తీసుకురావడానికి మరింత కష్టపడక తప్పదు. 2005లో అమెరికాలో 'కత్రినా' పెను తుపాను విరుచుకుపడినప్పుడు, ఆ ప్రాంత పునర్నిర్మాణం కోసం విధానపరమైన నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించి ప్రజల్లో భరోసా పెంచగలిగారు. ఈ తరహా విధానాన్ని రాష్ట్రంలో అవలంబించాలి. రంగాలవారీగా జరిగిన నష్టాన్ని భర్తీచేసే ప్రణాళికలను బడ్జెట్లో ప్రత్యేకంగా పొందుపరచాలి. పౌరసమాజాన్ని, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాముల్ని చేసి నష్ట అంచనాలు, పంపిణీ, పల్లెలు, గిరిజన ప్రాంతాలతో సహా పట్టణాల పునర్నిర్మాణంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో వనరుల సమీకరణకు నడుం బిగించాలి. అడవుల పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ వనీకరణ(కంపా) వంటి నిధులు రాష్ట్రానికి రాబట్టేలా కృషిసల్పాలి. భవిష్యతులో రాబోయే విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే విధంగా ప్రభుత్వ వ్యవస్థలను సన్నద్ధం చేయాలి. విపత్తుల కమిటీల్లో స్థానికుల భాగస్వామ్యం ఎంతైనా అవసరం. ఆ మేరకు వారికి తగిన శిక్షణ అందజేయాలి. ప్రకృతి వ్యవస్థలకు హాని కలగకుండా, ప్రకృతి వైపరీత్యాలకు దారి తీయకుండా తీర ప్రాంత వనరుల వినియోగం, యాజమాన్యం, నిర్వహణకు పటిష్ఠ ప్రణాళికలు రూపొందించి, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాలి. అప్పుడే బాధిత ప్రజలకు భవిష్యత్తుపై భరోసా పెరుగుతుంది. విపత్తులను ఎదుర్కోగలమనే ధీమా ఏర్పడుతుంది.
(రచయిత - గంజివరపు శ్రీనివాస్‌ )

Post a Comment

Copyright © తాజా వార్త.
Designed by OddThemes &